‘జనసేన’ తో రాజకీయాలలో ప్రవేసించిన పవన్ మొదటి నుండి వ్యూహాత్మక తప్పులు కొనసాగిస్తూనే వచ్చాడు. కొంతకాలం ముఖ్యమంత్రి పదవి తన లక్ష్యం కాదు అంటూ ఉపన్యాసాలు ఇచ్చిన పవన్ ఎన్నికల ప్రచారంలో తాను కాబోయే ముఖ్యమంత్రిని అంటూ కన్ఫ్యూజ్ చేసాడు.
దీనికితోడు పవన్ మాట్లాడే ప్రతి మాటలోనూ క్లారిటీ లేకపోవడంతో ఆవేశంతో అతడు చేసిన ఉపన్యాసాలు అతడి అభిమానులకు కనెక్ట్ అయ్యాయి కానీ సామాన్యుడుకి కనెక్ట్ కాలేదు అన్న కామెంట్స్ వచ్చాయి. ఇలాంటి పరిస్థుతులలో నిన్న ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల సందర్భంగా విజయవాడ పటమట పోలింగ్ కేంద్రంలో పవన్ ప్రవర్తించిన విచిత్రమైన తీరుపై ఎన్నికలు ముగిసాక కూడ తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
నిన్న పోలింగ్ రోజున ప్రముఖులు అంతా క్యూలో నుంచుని ప్రజలకు ఇబ్బంది లేకుండా ఓటు వేసి ఓటర్లను పలకరించుకుంటూ వెళ్ళి పోయారు. అయితే జనసేనాని మాత్రం విజయవాడ పటమటలోని పోలింగ్ కేంద్రానికి సుమారు పది మంది సెక్యూరిటీ సిబ్బందితో వచ్చాడు. పవన్ రావడంతోనే అతడి వెంట వచ్చిన సెక్యూరిటీ సిబ్బంది అప్పటికే ఓటు వేయడానికి వచ్చిన జనాన్ని నెట్టేసి నేరుగా పవన్ ను పోలింగ్ స్టేషన్ లోకి తీసుకు వెళ్ళిపోయారు. ఈ అనుకోని సంఘటనకు షాక్ అయిన చాలమంది విమర్శలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు ప్రతిపక్ష నేత జగన్ సినిమా సెలెబ్రెటీలు అంతా సామాన్యుల మధ్య క్యూలో నుంచుని ఓట్లు వేస్తే పవన్ ఈ తీరులో ప్రవర్తించాడు ఏమిటి అంటూ విమర్శలు వస్తున్నాయి.
గతంలో 2014 ఎన్నికలలో చిరంజీవి కూడ ఇలాగే క్యూలో నిలబడకుండా ఓటు వేయడంతో విమర్శలు రావడంతో ఆతరువాత క్షమార్పణలు చెప్పాడు. ఇప్పుడు పవన్ కు కూడా అలాంటి పరిస్థితి ఎదురైంది అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయమై ‘జనసేన’ వర్గాలు మాత్రం వేరుగా స్పందిస్తున్నాయి. ఓటింగ్ బూత్ వద్ద పవన్ ను చూడగానే జనం విపరీతంగా గుమి గూడటమే కాకుండా సేల్ఫీల కోసం ఓటర్లు ఎగబడటంతో ఇలాంటి పరిస్థితి వచ్చింది అంటు సద్ది చెపుతున్నారు..