అరవింద సమేత సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది అయితే సినిమా లో కొత్తదనం ఏముందని చాలా మంది అనుకుంటున్నారు. త్రివిక్రమ్ శైలికి భిన్నంగా ఈ సినిమా తీశారు. ముందు నుంచి ఈ సినిమా కథ మీద ఒక్కటే వినిపిస్తోంది. కథేమీ కొత్తది కాదు, త్రివిక్రమ్ ట్రీట్ మెంట్ కొత్తగా వుంటుదని. సీమ ఫ్యాక్షనిజం దాని నేఫథ్యంలో తొలిసగం అంతా ఓ ప్రేమ కథ, మలి సగం ఫ్యాక్షనిజాన్ని మంచి తనంతో రూపు మాపడం.
ఇప్పుడు విడుదలైన ట్రయిలర్ ఆ విషయాన్ని పక్కా చేసింది. త్రివిక్రమ్ అంటే పంచ్ లు పేల్చడం అనుకుంటే పొరపాటు, కత్తులు దూసి, గుండెల్లో ఈటెలు దించుతా అని పంతం పట్టినట్లు వుంది ట్రయిలర్. త్రివిక్రమ్ సినిమా వస్తోందంటే, పరుగెత్తుకు వెళ్లాలనే ఫ్యామిలీ ఆడియన్స్ ను లెగ్ బ్రేక్ వేసి ఆపినట్లు వుంది ట్రయిలర్. స్క్రీన్ అంతా రక్తపాతం చిందించే ప్రయత్నం బోయపాటి మాదిరిగా యథాశక్తి త్రివిక్రమ్ చేసినట్లు కనిపిస్తోంది.
ఓ పాట బిట్ లేదు, హీరో హీరోయిన్, విలన్, అమ్మమ్మ.. అంతే. సరే ఉన్నారు కాబట్టి డైలాగు లేకుండా సునీల్ మీద, ఈషా మీదా చెరో కట్. అంతే. సినిమా కథ ఎంత రొటీన్ అని వినిపిస్తోందో ట్రయిలర్ కూడా అంత రొటీన్ గానూ వుంది. త్రివిక్రమ్ కు కొత్తగా కనిపించాలని ఈ సినిమా చేసారేమో, కానీ ఆయనకు కొత్త కావచ్చు. బోయపాటి సినిమాలు బోలెడు చూసిన ఆడియన్స్ కు కాదు.