పాటల వేడుక ఉండదని, ఏకంగా రిలీజ్ కు 4 రోజుల ముందు ప్రీ-రిలీజ్ పెడతారంటూ వరుసగా కథనాలు వచ్చిన నేపథ్యంలో.. వాటికి చెక్ పెడుతూ ఆడియో రిలీజ్ డేట్ పక్కా చేశారు. ఈనెల 20న అరవింద సమేత పాటల్ని విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. అయితే ఆడియో ఫంక్షన్ అనేది పేరుకు మాత్రమే అని తెలుస్తుంది. అయితే ఇక్కడ నందమూరి అభిమానులు సంతోష పడాల్సినంత మేటర్ లేదు.
అవును.. అరవింద సమేత ఆడియో రిలీజ్ ను నామ్ కే వాస్తే చేయాలని నిర్ణయించారు. ఆ రోజున ఎలాంటి ఫంక్షన్లు పెట్టరు. ప్రత్యేక అతిథులు ఎవరూ ఉండరు. ఇంకా చెప్పాలంటే చిన్న ప్రెస్ మీట్ కూడా ఉండదు. జస్ట్ యూట్యూబ్ తో పాటు, మరికొన్ని మ్యూజిక్ వెబ్ సైట్స్ లో పాటల్ని విడుదల చేసి చేతులు దులుపుకుంటారంతే. ఈమధ్యే ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణ కాలంచేశారు. అది జరిగి నెల రోజులు కూడా కాకముందే ఓ పెద్ద ఫంక్షన్ పెట్టడం ఎన్టీఆర్ కు ఇష్టంలేదు. అందుకే ఆడియో రిలీజ్ వద్దనుకున్నారు.
పాటల్ని ఆన్ లైన్లో విడుదల చేసి ఊరుకుంటారు. అలాఅని సినిమా ప్రచారాన్ని గాలికొదిలేయడం లేదు ఎన్టీఆర్. ప్రీ-రిలీజ్ ఫంక్షన్ ను అత్యంత భారీగా సెలబ్రేట్ చేయాలని నిర్ణయించాడు. ఆ ఫంక్షన్ కు ప్రత్యేక అతిథులు బాలయ్య, చంద్రబాబు వచ్చే ఛాన్స్ ఉంది. అరవింద సమేత చిత్రానికి తమన్ సంగీతం అందించాడు. ఎన్టీఆర్-తమన్ కాంబో ఆడియన్స్ కు కొత్తకాదు. కానీ త్రివిక్రమ్-తమన్ కాంబో మాత్రం కచ్చితంగా కొత్త. అందుకే పాటలు ఎలా ఉంటాయనే ఆసక్తి అందర్లో ఉంది.