నటుడిగా నిరూపించుకోవాలన్న లక్ష్యంతో దొరికిన పాత్రలన్నీ చేస్తూ, టీవీ సీరియల్స్ లో నటిస్తూ, జబర్దస్త్ కార్యక్రమంలో నవ్వించిన సాదా సీదా క్యారెక్టర్ ఆర్టిస్ట్...కానీ ఇప్పుడు అతను పోలీసులకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్.  చిన్న చిన్న వేశాలు వేస్తూ ఉన్న ఆ వ్యక్తి ఇప్పుడు  శేషాచలం అడవుల్లో ఎర్రచందనాన్ని స్మగ్లింగ్ చేస్తూ కోట్లకు పడగలెత్తాడు. అంతేకాదు, ఓ క్యారెక్టర్ ఆర్టిస్టు హీరోగా నటించగా, ఇటీవలే విడుదలైన చిత్రానికి ఫైనాన్స్ కూడా అందించాడు.
స్మగ్లింగ్‌లో మెలుకువలు నేర్చుకున్న తర్వాత సొంతంగా సంపాదనకు దిగాడు. అనతికాలంలోనే కోట్లాది రూపాయలు సంపాదించాడు. ఇటీవల తోటి క్యారెక్టర్ ఆర్టిస్ట్‌ హీరోగా తీసిన సినిమాలో స్మగ్లర్ కం ఆర్టిస్ట్ అయిన ఇతడు పెట్టుబడి కూడా పెట్టాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న పోలీసులు అతడి కోసం గాలింపు మొదలుపెట్టారు.
ఈ జబర్ధస్త్ నటుడికి తమిళనాడు, కర్నాటకకు చెందిన పెద్ద పెద్ద స్మగ్లర్లతో సంబంధాలు ఉన్నట్టు చెబుతున్నారు. పక్కా ఆధారాలతో ఇప్పటికే నటుడిపై 20 కేసులు నమోదు చేశారు. ఇతను ఫైనాన్స్ చేసిన పలు చిత్రాలు ప్రస్తుతం నిర్మాణ, నిర్మాణానంతర దశలో ఉన్నాయని తెలుస్తోంది. కొందరు విద్యార్థులు, పల్లెల్లో పనిచేసే డాక్టర్లు, ప్రైవేటు ఉద్యోగులు కూడా ఎర్రచందనం అక్రమ రవాణాలో భాగమైనట్టు గుర్తించిన పోలీసులు వారి గురించి కూడా ఆరా తీస్తున్నారు.
 
Top