గతవారం సంక్రాంతి రేస్ కు విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుని కలక్షన్స్ విషయంలో కూడ దూసుకుపోతున్న ‘శతమానం భవతి’ హిట్ శర్వానంద్ కు పెద్దగా జోష్ ను కలిగించ లేకపోయినట్లు వార్తలు వస్తున్నాయి. దీని వెనుక ఒక ఆసక్తికర కారణం ఉంది. ఈసినిమాలోని హీరో పాత్రకు దిల్ రాజ్ చాలందిని అన్వేషించినట్లు టాక్.
ముందుగా ఈమూవీలో హీరోగా రాజ్ తరుణ్ ను అనుకున్నారట. ఆ తరువాత ఈమూవీ నాని వద్దకు వెళ్ళింది. అయితే వీరిద్దరూ ఈ మూవీ వల్ల తమ హీరో ఇమేజ్ ఏమాత్రం పెరగదు కేవలం ఒక ఫీల్ గుడ్ మూవీగా మిగిలిపోయి మాస్ కు పెద్దగా ఈపాత్ర ద్వారా తాము దగ్గర కాము అన్న భావనతో రాజ్ తరుణ్ నానీలు ఈమూవీ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్న తరువాత ఈ మూవీ ప్రాజెక్ట్ లో శర్వానంద్ వచ్చి చేరినట్లు తెలుస్తోంది.
మొదట్లో శర్వానంద్ కూడా ఈ కథ విని చాలా తటపటాయించాడట. చేయాలా, వద్దా అనే చర్చలతోనే రెండు నెలలు పక్కన పెట్టేశాడు అని టాక్. కేవలం దిల్‌రాజు జడ్జిమెంట్ పై నమ్మకం, ఆ బ్యానర్ వేల్యూ చూసి ఈ కథలో హీరోగా నటించడానికి శర్వానంద్ ఒప్పుకున్నట్లు తెలుస్తోంది.
అయితే ఈ పాత్రను చేయడం వల్ల శర్వానంద్ కు ఈసినిమా ద్వారా కొత్తగా వచ్చిన ఇమేజ్ ఏమి కనపడలేదని ప్రస్తుతం శర్వానంద్ భావిస్తున్నట్లు టాక్. విమర్శకులు కూడ ఈసినిమాలో నటించిన అనుపమ పరమేశ్వరన్ నటనకు గ్లామర్ కు ఎక్కువ మార్కులు వేయడంతో శర్వానంద్ నటన గురించి పట్టించుకున్న విమర్శకులు తక్కువ అన్న భావనలో శర్వానంద్ ఉన్నట్లు టాక్.
దీనికితోడు ఈసినిమా విడుదల తరువాత అనుపమా పరమేస్వరన్ తన క్రేజ్ పెరిగిపోవడంతో తన పారితోషికం కూడ బాగా పెంచి చరణ్ తో సుకుమార్ దర్శకత్వంలో నటించబోయే లేటెస్ట్ మూవీ కోసం 50 లక్షలు పారితోషికాన్ని తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనితో అటు పారితోషికం విషయంలో కాని ఇటు హీరో క్రేజ్ విషయంలో కాని తనకు ఏమాత్రం కలిసిరాని ‘శతమానం భవతి’ లో నటించి తాను ఏమి సాధించాను అంటూ శర్వానంద్ ప్రస్తుతం అంతర్మధనంలో ఉన్నట్లు టాక్. ఏది ఎలా ఉన్నా క్రితం సంక్రాంతితో పాటు ఈ సంక్రాంతికి కూడ వచ్చిన శర్వానంద్ సినిమాలు సక్సస్ కావడంతో శర్వాకు సంక్రాంతి హీరోగా ముద్రపడినట్లు అనుకోవాలి..