తెలుగు, తమిళ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నాడు హీరో విక్రమ్.  మొదట తెలుగు సినిమాల్లో నటించినప్పటికే పెద్దగా ఆదరణ కరువైన ఈ హీరో తమిళంలో మాత్రం స్టార్ హీరోగా ఎదిగారు.   సినిమా ఇండస్ట్రీలో కమల్ హాసన్ తర్వాత ఆ తరహా ప్రయోగాత్మక చిత్రాల్లో నటించిన హీరో ఎవరంటే ఒక్క విక్రమ్ అనే చెప్పాలి.  ఆ మద్య శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘ఐ’ చిత్రంలో కురూపిగా నటించి అందరి మన్ననలు పొందారు.  కమర్షియల్ గా ఆ సినిమా హిట్ కాకపోయినా విక్రమ్ నటనకు జనం నీరాజనాలు పట్టారు.

గత సంవత్సరం ‘ఇంకొక్కడు’చిత్రంలో రెండు విభిన్న పాత్రలు పోషించి మంచి హిట్ సాధించాడు.  తాజాగా విక్రమ్, అను ఇమ్మాన్యుయేల్ కీలక పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'ధ్రువ నక్షత్రం'. ఈ చిత్రానికి గౌతమ్‌ వాసుదేవ మేనన్‌ దర్శకత్వం వహిస్తున్నారు.  స్పై థ్రిల్లర్‌ మూవీగా దీన్ని తెరకెక్కిస్తున్నారు. హేరిస్‌ జయరాజ్‌ సంగీతాన్ని అందిస్తున్నారు.  
వాస్తవానికి  ఈ చిత్రంలో సూర్య నటించాల్సి ఉన్నా కొన్ని అభిప్రాయ బేధాల వల్ల విక్రమ్ హీరోగా నటించాల్సి వచ్చింది.  సంక్రాంతి సందర్భంగా టీజర్‌ను చిత్ర యూనిట్ అభిమానులతో పంచుకుంది. టీజర్‌ను చూసిన అభిమానులు హాలీవుడ్‌ స్థాయిలో చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నట్లు సంబరపడతున్నారు. ఈ టీజర్‌ను చూస్తే హాలీవుడ్‌ స్థాయిలో చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నట్లు కనిపిస్తోంది. 

 
Top