బాలీవుడ్ లో చూస్తుంటే ఇప్పుడు విడాకుల నామ సంవత్సరం నడుస్తున్నట్లుగా ఉంది. ఎందుకంటే  బాలీవుడ్‌లో విడాకుల పరంపర కొనసాగుతోంది. ‘హృతిక్‌ రోషన్‌–సుజానే ఖాన్, అర్భాజ్‌ ఖాన్‌–మలైకా ఆరోరా’ జంటలు ఇటీవలే విడిపోయిన సంగతి తెలిసిందే. తాజాగా ప్రముఖ నటి, దర్శకురాలు నందితా దాస్, నిర్మాత సుభోద్‌ మస్కరా ఈ జాబితాలోకి చేరనున్నారు. 
ఈ ఇద్దరూ జనవరి 2న పెళ్లి చేసుకున్నారు. 2010లో వివాహం జరిగింది. కట్‌ చేస్తే, ఈ జనవరి 2 కి తాము విడిపోతున్న విషయాన్ని ప్రకటించారు. అందరూ న్యూ ఇయర్‌ సంబరాల్లో ఉంటే, దిత మాత్రం భర్త నుంచి తాను విడిపోతున్న విషయం ప్రకటించి, కొత్త సంవత్సరంలో తాను తీసుకున్న కీలక నిర్ణయం గురించి పేర్కొన్నారు. ఏడేళ్లుగా కలసి ఉన్న ఈ జంట కొంత కాలంగా వేరుగా ఉంటున్నారు.
విడిపోతున్న విషయం గురించి నందిత మాట్లాడుతూ – "అవును మేము విడిపోతున్నాం. ఈ విషయం చెప్పటం కొంచెం కష్టంగానే ఉంది. సుభోద్‌ తో ఇక మీదట కలసి ఉండాలనుకోవడంలేదు. మేం స్నేహ పూర్వకంగానే విడి పోవాలనుకుంటున్నాం. మా అబ్బాయి విహాన్‌ కంటే మాకేదీ ఎక్కువ కాదు. తన కోసమే మేం ఈ నిర్ణయం తీసుకున్నాం. ఈ విషయం గురించి చిలవలు పలవలు చేసి, మాట్లాడొద్దని విన్నవించుకుంటున్నాను. నేను కూడా దీని గురించి మళ్లీ మాట్లాడదల్చుకోలేదు. ఇక మీదట నా కొడుకు తో, కుటుంబసభ్యుల తో ఉండాలనుకుంటున్నాను" అన్నారు.
జన వరి 2, నందిత జీవితంలో మర్చిపోలేని రోజవుతుంది. పెళ్లి తాలుకు ఆనందాన్ని, విఫలమైన పెళ్లి తాలూకు చేదు అనుభవాన్ని మిగిల్చిన రోజుగా మిగిలిపోనుంది. నందిత సినిమా కెరీర్‌ విషయానికొస్తే, "ఫైర్‌’, ఎర్త్‌, బిఫోర్‌ ద రైన్స్‌" వంటి ఆఫ్‌బీట్‌ చిత్రాల్లో నటించిన ఆమె "ఫిరాక్‌" తో పాటు పలు హిట్‌ చిత్రాలకు దర్శకత్వం వహించారు. "ఫిరాక్‌" చిత్రం ఆమెకు పలు ప్రతిష్టాత్మక అవార్డులు తెచ్చిపెట్టింది. ప్రస్తుతం ఓ తమిళ సినిమా లో నటిస్తున్నారు.

 
Top