వంగవీటి సినిమా దర్శకుడు రాంగోపాల్ వర్మ తమను మోసం చేశారని వంగవీటి యువసేన తీవ్రంగా మండిపడింది. రంగా చేసిన సామాజిక సేవలను ఎక్కడా చూపించలేదని మండిపడ్డారు. వర్మ తీరుతో తమ మనోభావాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని, వంగవీటి మోహనరంగా చేసిన సమాజసేవను మళ్లీ చిత్రీకరించి రెండు రోజుల్లో సినిమాను రీ రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే తాము తీవ్రస్థాయిలో ఉద్యమిస్తామని హెచ్చరించారు.

ఈ సినిమాలో రంగాను హీరోగా చూపిస్తామని తమకు చెప్పారని, తాము షూటింగ్‌లో పాల్గొన్న సమయంలో రంగాను హీరోగానే చూపించారు గానీ, అసలు విడుదలైన సినిమాలో అలాంటి సీన్లు ఎక్కడా లేవని యువసేన ప్రతినిధులు అన్నారు. 

దర్శకుడు రాంగోపాల్ వర్మకు మతిభ్రమించి 'వంగవీటి' చిత్రం తీశాడని విజయవాడ సీపీఐ నేతలు మండిపడ్డారు. ప్రజల కోసం ఎంతో పోరాడి హత్యకు గురైన చలసాని వెంకటరత్నం పాత్రను ఈ చిత్రంలో తప్పుగా చూపారని ఈ ఉదయం మీడియాతో మాట్లాడిన సీపీఐ నేత దోనేపూడి శంకర్ ఆరోపించారు. వెంకటరత్నాన్ని మద్యానికి బానిసైన వ్యక్తిగా చూపారని, ఆయన్ను కించపరిచేలా చిత్రం ఉందని అన్నారు. చిత్రంపై తమకు అభ్యంతరాలున్నాయని, వాటిని తొలగించకుంటే, వర్మకు బుద్ధి చెబుతామని శంకర్ హెచ్చరించారు. వెంటనే ఆ సన్నివేశాలను తొలగించాలని డిమాండ్ చేశారు. 
 
Top