అఖిల్ దూరం జరగడంతో అనుకోకుండా మళ్ళీ యూటర్న్ తీసుకుని ఈవారం దసరా
పండుగకు విడుదల కాబోతున్న ‘కంచె’ దర్శక నిర్మాతలను ఒక అనుకోని భయం
వెంటాడుతోంది అన్న రూమర్స్ ఫిలింనగర్ లో హడావిడి చేస్తున్నాయి. మెగా
అభిమానులు, ముఖ్యంగా పవన్ అభిమానుల కోపంతో ‘బ్రూస్ లీ’ కి దూరంగా జరిగారు
అన్న విశ్లేషణలు ఇప్పటికే ‘బ్రూస్ లీ’ ఓపెనింగ్ కలక్షన్స్ విషయం పై వచ్చిన
నేపధ్యంలో మెగా ఫ్యామిలీ పవన్ తో కొంతవరకు సద్దుపాటు చేసుకున్న విషయం
తెలిసిందే.
అయితే ఈవ్యవహారం ఇక్కడితో
సద్దుమణిగి పోతుందా లేదంటే పవన్ అభిమానుల కోపం ‘కంచె’ పై కూడ ప్రభావాన్ని
చూపెడుతుందా అన్న భయంతో ‘కంచె’ దర్శక నిర్మాతలు అదేవిధంగా ఈ సినిమాను
కొనుక్కున్న బయ్యర్లు సందేహిస్తున్నట్లు టాక్. మెగా ఫ్యాన్ బేస్ కు
సంబంధించి ఒక వారధిగా నాగబాబు అనేక సంవత్సరాలుగా వ్యవహరిస్తూ వచ్చాడు. మెగా
హీరోల సినిమాల విడుదలకు ముందు చేయవలసిన హంగామా గురించి నాగబాబు అనేక
సూచనలు మెగా అభిమానులకు చేస్తూ ఉండేవాడు.
అయితే
చిరంజీవి షష్టిపూర్తి వేడుకలలో నాగబాబు తీవ్ర అసహనంతో పవన్ అభిమానులను
టార్గెట్ చేస్తూ కామెంట్ చేయడంతో ఈ విషయాన్ని పవన్ అభిమానులు సీరియస్ గా
తీసుకుని ఈమధ్య కాలంలో నాగబాబును కలవడం మానివేసారని టాక్. ప్రస్తుతం పవన్
అభిమానులకు నాగబాబుకు చాల దూరం ఏర్పడటంతో ఆ ప్రభావం నాగబాబు కొడుకు వరుణ్
తేజ్ ‘కంచె’ ఓపెనింగ్ కలెక్షన్స్ పై కూడ తీవ్ర ప్రభావం చూపెడుతుంది అని
వస్తున్న వార్తలు ‘కంచె’ నిర్మాతలను భయపెడుతున్నట్లు టాక్.
దీనికితోడు
వరస పెట్టి మెగా హీరోల సినిమాలు లైన్ గా విడుదల అవుతూ ఉండటంతో విడుదల
రోజునాడు ధియేటర్ల ముందు హడావిడి చేయడానికి ఎంతకని సొంత డబ్బులు ఖర్చు
పెట్టేది అంటూ చాల మంది మెగా అభిమానులు తమలో తాము మధనపడుతూ
చర్చించుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతానికి పవన్, చిరంజీవిల
మధ్య కోల్డ్ వార్ ఆగిపోయిన సంకేతాలు వస్తున్న నేపధ్యంలో ‘కంచె’ ను మెగా
అభిమానులు ముఖ్యంగా పవన్ అభిమానులు ఎంత వరకు కరుణిస్తారో చూడాలి..