మెగా బ్రదర్ నాగబాబు చాల సౌమ్యంగా ఉంటూ వివాదాలకు దూరంగా తన పని ఏదో తాను
చేసుకుపోతూ ఉంటాడని నాగబాబు సన్నిహితులు అంటూ ఉంటారు. ఈ మధ్యనే సోషల్ నెట్
వర్కింగ్ సైట్లో తన ఫేస్ బుక్ ట్విటర్ ఖాతాలను ప్రారంభించి మెగా అభిమానులకు
మరింత అందుబాటులో ఉండటానికి ప్రయత్నిస్తున్నాడు.
‘ప్రజారాజ్యం’ పార్టీలో కీలక పాత్ర పోషించినా ఆ తరువాత ప్రజారాజ్యం
పార్టీని చిరంజీవి కాంగ్రెస్ లో కలిపేసిన తరువాత రాజకీయాలకు చాల దూరంగా
ఉంటున్నాడు నాగబాబు. పవన్ ‘జనసేన’ పార్టీని స్థాపించినప్పుడు కూడా తాను
రాజకీయాలకు దూరం అంటూ ప్రకటన ఇవ్వడమే కాకుండా తన సపోర్టు మాత్రం తన అన్న
చిరంజీవికే అని ప్రకటన ఇచ్చాడు నాగబాబు ఇదంతా గతం.
ప్రస్తుతం బుల్లితెర పై సీరియల్స్ లో నటిస్తూ రియాలిటీ షోలకు జడ్జిగా
వ్యవహరిస్తున్న నాగబాబును వెబ్ మీడియాలో ఒక అభిమాని రాజకీయాల్లోకి మళ్లీ
వచ్చే ఉద్దేశ్యం ఉందా అని అడిగిన ప్రశ్నకు నాగబాబు ఖచ్చితమైన సమాధానం
ఇచ్చాడు.
కొన్నేళ్ల క్రితం తన సోదరుడు చిరంజీవి రాజకీయ పార్టీని స్థాపించినప్పుడు
తాను మద్దతు ఇస్తూ పలు కార్యక్రమాల్లో పాల్గొన్నానని, ఆ పార్టీ ఎన్నికల్లో
ఓడిపోవడంతో చాలా మార్పులు వచ్చాయని అంటూ తాను కాంగ్రెసులో సభ్యుడిగానే
ఉన్నానని, అయితే తనకు తన సోదరుడు చిరంజీవితో తప్ప వేరే ఎవరితోనూ సంబంధాలు
లేవని ఆయన స్పష్టం చేశారు.
నిజం చెప్పాలంటే తనకు రాజకీయాలపై భ్రమలు తొలగిపోయాయని, తాను తిరిగి
రాజకీయాల్లోకి వెళ్తానని అనుకోవడం లేదని అంటూ కామెంట్ చేసాడు నాగబాబు.
అంతేకాదు ముందు ప్రజలు మారాలని, అప్పుడే రాజకీయ వ్యవస్థలో ఏమైనా చేయగలమని
అంటూ తాను ప్రస్తుతం బుల్లితెర పై నటిస్తూ సినిమాలు చేస్తూ ఆనందంగా
ఉన్నానని తనకు ఎటువంటి రాజకీయ కలలు లేవు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసాడు మెగా
బ్రదర్.