ప్రస్తుతం టాలీవుడ్ సీనియర్ టాప్ హీరోలతో నటించడానికి యంగ్ హీరోయిన్స్ వెనుకడుగు వేస్తున్న సమయంలో శ్రుతిహాసన్ తీసుకున్న నిర్ణయం టాలీవుడ్ విశ్లేషకులను ఆశ్చర్య పరుస్తోంది అనే వార్తలు వస్తున్నాయి. సామాన్యంగా క్రేజీ టాప్ హీరోయిన్స్ ఒక చట్రంలో ఇమిడిపోయి దానినుంచి బయటకు రావడానికి ఇష్టపడరు. గ్లామర్ హీరోయిన్ గా గుర్తింపు ఉన్నా ధైర్యం చేసి బాలీవుడ్ సినిమా ‘డీడే’ లో ఒక వేశ్యగా శ్రుతిహాసన్ నటించినప్పుడే శ్రుతి ధైర్యానికి బాలీవుడ్ షాక్ అయింది. ఇప్పుడు టాప్ యంగ్ హీరోలతో నటిస్తూ బిజీగా ఉన్న శ్రుతి మరో సంచలనానికి తెర తీస్తోంది అనే వార్తలు వస్తున్నాయి. ఫిలింనగర్ లో వినిపిస్తున్న వార్తల ప్రకారం శ్రుతి హీరో వెంకటేష్ తో దర్శకుడు దశరథ్ దర్శకత్వం వహించబోతున్న సినిమాలో హీరోయిన్ గా నటించడానికి అంగీకారం తెలిపినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఎన్నో ఫ్యామిలీ ఎంటర్ టైన్మెంట్ సినిమాలకు గతంలో దర్శకత్వం వహించిన దశరథ్ నాగార్జునతో తీసిన ‘గ్రీకువీరుడు’ తర్వాత రామ్‌చరణ్‌తో మూవీ చేయడం కోసం వెయిట్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే అనుకోకుండా దశరధ్ ‘దృశ్యం’ లాంటి ఫ్యామిలీ లైన్‌తో వెంకీని కలిసి ఓకే చేయించడమే కాకుండా ఈ మూవీలో నటించడానికి శ్రుతిహాసన్ ను ఒప్పించడం ఇప్పుడు టాలీవుడ్ కు హాట్ న్యూస్ గా మారింది. హీరోయిన్‌ కి ప్రాముఖ్యత ఉన్న పాత్ర కాబట్టి ఈ సినిమాలో శ్రుతి నటించడానికి అంగీకరించింది అని టాక్. ‘గోపాల గోపాల’ షూటింగ్ పూర్తి అయ్యాక ఈ సినిమా సెట్స్ పైకి వెడుతుంది అని అంటున్నారు.
 
Top