బుల్లితెర రియాలిటీషోలకు వ్యాఖ్యాత గా వ్యవహరించే ఉదయభాను తనకు బుల్లితెర ద్వారా వచ్చిన పాపులారిటితో సినిమా రంగంలో తన సత్తా చూపిద్దామని ప్రయత్నించినా ఆమెకు సినిమాలు పెద్దగా కలిసి రాకపోవడంతో తిరిగి జరుగుతున్న ఎన్నికల సందర్భంగా ఒక ప్రముఖ ఛానల్ లో 'నిగ్గదీసి అడుగు' అంటూ ఎన్నికలలో పోటీ చేస్తున్న నాయకులను తన ప్రశ్నలతో ఇబ్బంది పెడుతూ ఓటర్లని చైతన్యపరిచే పనిలో బిజీగా వుంది.  ఈ కార్యక్రమానికి మంచి రేటింగ్స్ కుడా వస్తున్నాయి. ఇంతవరకు బాగానే ఉంది, కానీ ఓటర్లను చైతన్య పరుస్తున్న ఈ కార్యక్రమం మింగుడుపడని కొంతమంది రాజకీయనాయకులు తనపై దాడులు చేసేందుకు వెనకాడటం లేదని చెపుతోంది ఉదయభాను. ఒక ప్రముఖ ఇంగ్లీష్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయాలు వెల్లడించింది. తన ప్రోగ్రామ్‌లో భాగంగా మారుమూల పల్లెల్లో జనాభిప్రాయసేకరణకు వెళ్లినప్పుడు కొంతమంది నాయకులు తనని వెంటాడుతున్నారని, ఇంకొంతమంది ఏకంగా చంపుతామని బెదిరిస్తున్నారనీ ఆవేదన వ్యక్తంచేసిందామె. అయితే వారి బెదిరింపులకు తాను భయపడనని, సమాజాన్ని మేలుకొలిపే ఇటువంటి పనులకు అడ్డం పడేవారిని చూసి తాను వెనుకాడబోనని ఆమె అభిప్రాయపడుతోంది. ఓటర్లను జాగృతం చేసే కార్యక్రమాలు కుడా నచ్చని నాయకులు ఉన్న మనదేశంలో ఎన్నికలు ఎంత డ్రామాగా మారాయో అర్ధం అవుతోంది. భారతదేశం మొత్తం మీద ఎన్నికల సందర్భంగా పట్టు పడుతున్న నగదు విషయంలో ప్రధమ స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది అని ఎన్నికల సంఘం చెపుతూ ఉంటే ప్రజలను చైతన్య పరిచే ఎన్ని నిగ్గతీసే కార్యక్రమాలు ప్రసారం అయినా దాని ప్రభావం శూన్యం అనే అనుకోవాలి. 
 
Top