ఒక సింగర్ అనేక పాటలు పాడటం... అనేక లాంగ్వేజెస్ లో పాటలు పాడటం.... ఇదేం గొప్ప విషయం కాదు. కాని, గొప్ప విషయం ఏంటంటే... ఒక సింగర్ పాడినప్పుడు... ఏ భాషలో శ్రోతలు... ఆ భాషలో పాడింది తమ సింగరే అనుకోవటం! అలా ప్రతీ భాష వారికి కూడా తమ స్వంత సింగర్ పాడుతున్నట్టు భావన కల్పించటం కేవలం కొందరు లెజెండ్రీ సింగర్స్ కే సాధ్యం! అలాంటి ఓ తెలుగు గాన కోకిల... నైటింగేల్ ఆఫ్ సౌత్ ఇండియన్ మ్యూజిక్... బర్త్ డే ఈ రోజు! గాన కోకిల యస్.జానకి గారి పుట్టిన రోజు సందర్భంగా ఎపిహెరాల్డ్ ప్రత్యేక కథనం. గాయని అయిన ప్రతీ వారికి చక్కటి స్వరం వుంటుంది. అయితే, ఒక స్వరం దశాబ్దల తరబడి తరతరాల అంతరాల్ని ధిక్కరిస్తూ.... సినీ సంగీతపు ప్రణవంలా మోగటం.... చాలా చాలా కష్టం! మామూలు వారికైతే అసాధ్యం! కాని, ఏప్రెల్ 23, 1938న గుంటూరు జిల్లా రేపల్లెలో పుట్టిన జానకమ్మ ఆ పనిని అవలీలగా చేశారు. ఆమె స్వరం సనాతనం. అది ఆనాడు, ఈనాడు అని కాక ఏనాటికీ కొత్తగానే వినిపించే నిత్యనూతనం! భక్తి గీతాలు మొదలు హస్కీ సాంగ్స్ వరకూ..... చిన్నారుల గొంతుక మొదలు సంస్కృత సమాసాలతో నిండిపోయిన పాటల వరకూ తన సుదీర్ఘ కెరీర్ లో ఎస్ జానకి పాడని పాటంటూ లేదు. అయితే, ఆశ్చర్యం ఏంటంటే ఇంత ప్రజ్ఞా, పాటవాలూ ఆమెకి సుదీర్ఘమైన సాధన తరువాత వచ్చినవి కావు. అతి చిన్న వయస్సు నుంచే ఆమె ఇంట్లోని రేడియోని గురువుగా చేసుకుని గొంతు సవరించుకుంది. రేడియోలో వచ్చే లతా మంగేష్కర్ లాంటి మహా గాయనీమణుల పాటలు వింటూ ఒడిసిపట్టేసేది! అదే తరువాత ఆమెకి సినీ సంగీతంలో తిరుగులేకుండా చేసింది..... మలయాళ, తమిళ సినిమా రంగాల్లో ఎన్నో అద్భుతమైన పాటలు పాడిన జానకీ తెలుగులో సహజంగానే అపురూప రాగాలు ఆలపించారు. మాతృభాష అయిన తెలుగులో ఆమె కురిపించిన గానామృత ధారలు అత్యంత మథురం. బావమరదళ్లు సినిమాల్లో పెండ్యాల నాగేశ్వర్ రావుగారూ ఆమె చేత తొలి తెలుగు పాట పాడించారు. అప్పట్నుంచీ ఏళ్లకేళ్లు సాగిన ఆమె స్వర పయనం... క్రమశిక్షణ మరో గొప్ప అలంకారంగా అప్రతిహతంగా కొనసాగింది.... ఊరికే పాటలు పాడేయటమే కాదు తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో మొత్తం నాలుగు నేషనల్ అవార్డ్స్ కూడా పొందారు జానకమ్మ. అంతే కాదు, ప్రతీ భాషలోనూ ఇళయరాజా లాంటి సంగీత తపస్వులు ఆమె చేత అద్భుతాలు చేయించారు. భారతీయ సినీ చరిత్రలో జానకమ్మ తప్ప మరెవరూ ఇవి పాడలేరు అనేటటువంటి అనుపమాన గీతాలు ఎన్నో పాడారు.... భారతీయ భాషలే కాదు జపనీస్, సింహళ వంటి విదేశీ భాషల్లోనూ ఎస్ జానకీ పాటలు పాడారు. అంతే కాదు ఈ వెర్సటైల్ లెజెండ్రీ సింగర్ స్వయంగా పాటలు రాస్తారు కూడా!వేలాది పాటలు పాడిన ఆమె ఈ మధ్య కాలంలో భక్తి గీతాలకే పరిమితమవుతున్నారు. అయితే, ఏఆర్ రెహమాన్ ట్యూన్స్ కి ఆమె అందించిన గాత్రం ఈ తరం వార్ని కూడా ఎంతో ఉత్సహపరిచి.. అదృష్టవంతుల్ని చేసింది.
 
Top