గత సంవత్సరం విడుదల అయిన పవన్ ‘అత్తారిల్లు’ టాలీవుడ్ కలక్షన్స్ రికార్డులను తిరగ రాస్తే అదే సంవత్సరం మొదట్లో విడుదల అయిన ప్రిన్స్ మహేష్ ‘సీతమ్మ వాకిట్లో’ తెలుగు మల్టీ స్టారర్ హవాకు మళ్ళీ తెరతీసి ఈ రెండు సినిమాలు గత సంవత్సరం విడుదలైన సినిమాలలో ట్రెండ్ సెటర్లుగా నిలిచాయి. జాతీయ స్థాయి ప్రాంతీయ ఉత్తమ చిత్రం అవార్డు ఈ టాప్ హీరోల సినిమాలలో ఎదో ఒక సినిమాకు వస్తుందని ఆశించారు. అయితే అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ రాజేష్ టచ్ రివర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘నా బంగారు తల్లి' జాతీ అవార్డుల రేసులో తెలుగు సినిమా సత్తాను చాటింది. 2013 సంవత్సరానికిగాను జరిగిన జాతీయ అవార్డుల రేసులో ఏకంగా మూడు అవార్డులను సొంతం చేసుకుంది. ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా, ఉత్తమ నేపథ్య సంగీతం విభాగంలో అవార్డులు సొంతం చేసుకుంది. దీంతో పాటు ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించిన అంజలి పాటిల్ స్పెషల్ జ్యూరీ అవార్డు చేజిక్కించుకుంది.  ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు రాజేష్ టచ్ రివర్ మాట్లాడుతూ...‘జాతీయ స్థాయిలో అవార్డు రావడం ఆనందంగా ఉంది. గతంలో ఇండోనేషియాలో అవార్డ్ ఆఫ్ ఎక్సలెన్సీ, బెస్డ్ సినిమా ఆఫ్ ఫెస్టివల్, ట్రినిడి ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ అవార్డుతో పాటు అనేక అవార్డులను ఈ సినిమా సొంతం చేసుకుంది’ అని అంటు తన ఆనందాన్ని మీడియాతో పంచుకున్నారు. గత సంవత్సరం విడుదలై విమర్శకుల ప్రసంసలు పొందిన ‘మిణుగురులు’ సినిమాకు కూడ అవార్డులు వస్తాయని ఆశించినా ఆ సినిమాలో కూడ కొన్ని కమర్షియల్ అంశాలు ఉన్నాయి అంటు అవార్డుల కమిటీ వ్యాఖ్యానించడం ఆశ్చర్యకరం. ఏమైనప్పటికీ టాప్ హీరోల సినిమాలకు కాకుండా జాతీయ స్థాయిలోని అన్ని భాషలలోను చిన్న సినిమాల హవా ఈసారి జాతీయ అవార్డుల ఎంపికలో స్పష్టంగా కనిపించింది. యదార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కిన ‘నా బంగారు తల్లి’ సినిమా తండ్రి కూతుళ్ల మధ్య ఉన్న అనుబంధంతో పాటు, నేడు సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలియజెప్పేదిగా ఉండటం అవార్డు న్యాయనిర్ణేతలను ఆకర్షించింది అనుకోవాలి.. 
 
Top