ఏవిషయం పై అయినా స్పష్టంగా తన మనసులోని మాటలను బయటపెట్టే మంచులక్ష్మి ఈమధ్య సోషల్ మీడియాలో తన అభిమానులతో ఛాట్ చేస్తూ కొనసాగించిన సంభాషణలో అనేక ఆసక్తికర కామెంట్స్ చేసింది. ‘మీ టూ’ ఉద్యమం దగ్గర నుండి ఈమధ్య ఎయిర్ ఇండియా విమానాల సర్వీసులలో ఉన్న లోపాలు వల్ల గంటల తరబడి ఎయిర్ పోర్ట్ లో వెయిట్ చేయవలసి వచ్చిన పరిస్థుతుల వరకు అనేక విషయాల పై తనదైన స్టైల్ లో సమాధానం ఇచ్చింది మంచు లక్ష్మి.
ఇదే సందర్భంలో ఒక అభిమాని ఆమెతో మాట్లాడుతూ త్వరలో మళ్ళీ మొదలు పెట్టబోతున్న ‘మేము సైతం’ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ ను చూసే అవకాసం ఉందా అని ప్రశ్నించినప్పుడు ఆమె ఈవిషయం పై చాల విభిన్నంగా స్పందించింది. గతంలో చాల సార్లు తాను పవన్ కళ్యాణ్ ను ‘మేము సైతం’ కార్యక్రమంలో పాల్గొనమని అభ్యర్ధించినా పవన్ స్పందించలేదు అని అంటూ దానికి వెనుక గల కారణాలు తనకు తెలియవు అంటూ షాక్ ఇచ్చింది ఈ మంచు వారి అమ్మాయి.
సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయిన మోహన్ బాబు క్రియేట్ చేసిన ‘ఫసక్' పదం గురించి మాట్లాడుతూ తాను ఇప్పుడు ప్రతిరోజు తరుచూ ఈపదం వాడకుండా మాట్లాడలేకపోతున్నాని అంటూ ఈపదంతో తనకు ఏర్పడ్డ బంధాన్ని వివరించింది. ఇక రాజకీయాల గురించి మాట్లాడుతూ తనకు రాజకీయాలు సరిపడవని అందువల్లనే తాను రాజకీయాల గురించి ఎప్పుడూ ఆలోచించను అంటూ మరో ట్విస్ట్ ఇచ్చింది.
ఇదే సందర్భంలో మరొక వ్యక్తి ఈ ప్రపంచాన్ని మార్చే శక్తి ఇస్తే మీరు మొదట ఏం చేస్తారు ? అని అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ ప్రతి ఒక్కరూ ఎదుటి వారిని సమానంగా చూసేలా చేస్తాను అంటూ తనలోని కమ్యూనిజం భావాలను బయట పెట్టింది. ఇక తన తండ్రి మోహన్ బాబు గురించి మాట్లాడుతూ ‘ది గ్రేటెస్ట్' అని వ్యాఖ్యానించింది. మరొక అభిమాని ఎయిర్ పోర్ట్ లో సమస్యలు ఎదుర్కొనే బదులు సొంతగా చార్టెడ్ ఫ్లైట్ కొనుక్కోవచ్చుగా అంటూ ఒక అభిమాని అడిగిన ప్రశ్నకు ‘నువ్వు కొను నేను ఎక్కుతా’ అంటూ ఆమె ఇచ్చిన రిప్లై బట్టి మంచు లక్ష్మిలోని వెటకారం కనిపిస్తోంది..