మంచి

  • నటులంతా
  • మ్యూజిక్
  • సినిమాటోగ్రఫీ

చెడు

  • మిస్సింగ్ ఎంటర్టైన్మెంట్
  • అక్కడక్కడ స్లో అనిపించడం
ఒక్క మాటలో: 'శతమానం భవతి' మంచి కుటుంబకథా చిత్రం..!

చిత్ర కథ

రాజుగారు (ప్రకాశ్ రాజ్), జానకమ్మ (జయసుధ) దంపతులు పల్లెటూరిలో జీవితం గడుపుతుంటారు. కొడుకులు కూతురు ఉన్నా సరే వారంతా ఫారిన్ లో సెటిల్ అవుతారు. సంక్రాంతికి వారిని పిలిచే ఆలోచనతో ఓ చిన్న ప్లాన్ చేస్తాడు రాజు గారు. ఆయన వేసిన పథకం ప్రకారం ఫారిన్ లో ఉన్న వారంతా పల్లెటూరికి వచ్చేస్తారు. రాజుగారి దగ్గర ఉంటున్న మనవడు రాజు (శర్వానంద్), ఫారిన్ నుండి వచ్చిన అత్త కూతురు నిత్యా (అనుపమ పరమేశ్వరన్) ప్రేమలో పడతారు. ఇద్దరు ఇష్టపడే సమయానికి రాజు గారు వేసిన ప్లాన్ కుటుంబ సభ్యులకు తెలీయడంతో అందరికి గొడవలవుతాయి. అసలు ఇంతకీ రాజు గారి ప్లాన్ ఏంటి..? రాజు కుటుంబాన్ని ఎలా ఒకటి చేశాడు..? అన్నది అసలు కథ.  

నటీనటుల ప్రతిభ

ముందుగా ఇలాంటి క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాలో నటించిన హీరో శర్వానంద్ కు ధన్యవాదాలు చెప్పాల్సిందే. కుటుంబ విలువలు తరిగిపోతున్న ఇలాంటి సమయంలో ఇలాంటి సినిమాలు చాలా అవసరం. ఇక రాజుగా సినిమాలో చలాకీ కుర్రాడిగా కేవలం హీరోయిన్ ను మాత్రమే కాదు ఆడియెన్స్ ను కూడా ఇంప్రెస్ చేస్తాడు శర్వానంద్. తెలుగులో విలక్షణ హీరోల్లో కచ్చితంగా శర్వానంద్ పేరు ఉంటుంది అని మరోసారి ఈ సినిమా ప్రూవ్ చేసింది. ఇక నిత్యాగా నటించిన అనుపమ పరమేశ్వరన్ అయితే నిజంగా తెలుగు పిల్లంటే నమ్మేయాలి అన్నంతలా ఉంటుంది. కట్టు బొట్టు అంతా ప్రేక్షకులకు నచ్చేలా డిజైన్ చేశారు. ఇక సినిమాలో లీడ్ రోల్ చేసిన ప్రకాశ్ రాజ్, జయసుధలు కూడా బాగా నటించారు. వారికి నటన వెన్నతో పెట్టిన విద్య అయినా సెటిల్డ్ పర్ఫార్మెన్స్ చేసి సినిమాకు మంచి భారీ తనం తెచ్చిపెట్టారు. ఇక సీనియర్ యాక్టర్ నరేష్ క్యారక్టర్ బాగుంది. ప్రతి ఇంట్లో ఇలాంటి పాత్ర ఒకటి ఉంటుందని చెప్పేయొచ్చు. మిగతా పాత్రధారులంతా తమ పరిధి మేరకు నటించారు.

సాంకేతికవర్గం పనితీరు

దిల్ రాజు సినిమా అనగానే ముందు ఆయన ఈసారి ఎంత టాలెంటెడ్ డైరక్టర్ ను ఎంకరేజ్ చేస్తున్నాడో అనిపిస్తుంది. ఆ క్రమంలోనే ఓ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా శతమానం భవతితో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు సతీష్ వేగేశ్న. కథ కథనాలలో దర్శకుడు చెప్పదలచుకున్న పాయింట్ మీద పర్ఫెక్ట్ గా ఉన్నా కథనంలో మాత్రం ఇంకాస్త జాగ్రత్తలు తీసుకుని ఉండాల్సింది. అయితే ఫ్యామిలీ ఎమోషన్స్ అన్ని ఒకేలా ఉంటాయి. దర్శకుడు ఆ డిఫరెన్స్ చూపించడంలో సక్సెస్ అయ్యాడు. ఇక సినిమాకు మ్యూజిక్ హైలెట్ గా నిలిచింది. మిక్కి జె మేయర్ అందించిన మ్యూజిక్ బాగుంది. సినిమాటోగ్రఫీ ముఖ్యంగా పల్లెటూరి వాతావరణం అంతా చాలా ఫ్రెష్ గా చూపించారు. ఇక ఎడిటింగ్ ఓకే కాని సెకండ్ హాఫ్ లో అక్కడక్కడ కాస్త స్లో అయినట్టు అనిపిస్తుంది. దిల్ రాజు ప్రొడక్షన్ వాల్యూస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సినిమాలో మరోసారి పల్లెటూరి పరిస్థితులను గుర్తుచేశారు.

చిత్ర విశ్లేషణ


దర్శకుడిగా దొంగలబండి సినిమా తీసిన సతీష్ వేగేశ్న చాలా గ్యాప్ తర్వాత శతమానం భవతి సినిమా తీశాడు. అసలైతే సినిమా పాయింట్ చాలా చిన్నది. దానికే అన్ని సొగసులు చేసుకుంటూ వచ్చి రెండున్నర గంటల సినిమా చేశారు. దర్శకుడు చెప్పిన కథ కథనంలో క్లారిటీ బాగుంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీలో ఎంతవరకు లిమిటేషన్స్ ఉంటాయో అన్నిటిలో అవి బాగా ఫాలో అయ్యాడు. కాని కథనంలో ఇంకాస్త గ్రిప్పింగ్ చేసుకుని ఉంటే బాగుండేది అనిపిస్తుంది. 

దర్శకుడు పరంగా సతీష్ కథనంలో కాస్త జాగ్రత్తలు తీసుకుని ఉంటే బాగుండేది. ఇక శర్వానంద్ నటన సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్. ఎలాంటి సినిమానైనా సరే తనదిగా చేసుకునే శర్వానంద్ శతమానం భవతి కూడా మనసు పెట్టి చేశాడు. శర్వా అనుపమ జంట బాగుంది. సినిమాలో మేజర్ సీన్స్ మెయిన్ కాస్ట్ అంతా ఉండటం విశేషం. అఫ్కోర్స్ కుటుంబ కథా చిత్రం కాబట్టి అందరు ఉండాల్సిందే..  

అయితే కథను డివీయేట్ చేయకుండా కామెడీ నడిపించాలని ప్రయత్నం మెచ్చుకోదగ్గదే కాని.. దర్శకుడు కామెడీ విషయంలో కూడా కాస్త కేర్ తీసుకుని ఉంటే బాగుండేది అని చెప్పాలి. ఓవరాల్ గా సినిమా మంచి ఫ్యామిలీ ఎమోషన్స్ కల కుటుంబకథా చిత్రం అని చెప్పొచ్చు. అయితే మాస్ మసాలా ఆడియెన్స్ కు నచ్చే అంశాలు కూడా ఉన్నా వారు రిసీవ్ చేసుకునే విధానం ఎలా ఉంటుందో మరి.

కాస్ట్ అండ్ క్రూ

  • Star Cast : Sharwanand, Anupama Parameswaran
  • Producer : Dil Raju,
  • Director : Vegesna Satish
  • Music : Mickey J Meyer
  • Released on: 14-01-2017
 
Top