మెగా స్టార్ చిరంజీవి నందమూరి బాలకృష్ణలు కత్తులు దూసుకుంటూ సంక్రాంతి వార్ కు తమ సినిమాల ద్వారా రెడీ అవుతూ ఉంటే నిన్న సాయంత్రం జరిగిన ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ ఆడియో ఫంక్షన్ లో చిరంజీవి మాటలు ఒకానొక సందర్భంలో హైలెట్ కావడం అందర్నీ ఆశ్చర్య పరిచింది. ‘శాతకర్ణి’ ఆడియో ఫంక్షన్ ను చాల విభిన్నంగా నిర్వహించిన ఈ మూవీ నిర్మాతలు ఈసినిమా ప్రారంభోత్సవం రోజున అతిధులుగా వచ్చిన కెసిఆర్ చిరంజీవి దాసరి వెంకటేష్ లు మాట్లాడిన మాటలను మళ్ళీ గుర్తుకు చేస్తూ ‘శాతకర్ణి’ ఆడియో ఫంక్షన్ పెద్ద స్క్రీన్ పై మళ్ళీ చూపెట్టారు. 

ఈ సందర్భంలో ఆరోజు చిరంజీవి ‘శాతకర్ణి’ సినిమా గురించి మాట్లాడుతూ ‘శాతకర్ణి’ బ్లాక్ బస్తర్ హిట్ కావడం ఖాయం అని అది బాలకృష్ణ కెరియర్ ను ఒక మలుపు తిప్పే సినిమా అవుతుందని చిరంజీవి అన్న మాటలను రెండు సార్లు రిపీట్ చేసారు.  దీనితో ‘శాతకర్ణి’ ఆడియో ఫంక్షన్ ను చూస్తున్న చాలమంది శాతకర్ణి మూవీని అనుకోకుండా చిరంజీవి ప్రమోట్ చేస్తున్నాడు అంటూ కామెంట్స్ చేసుకున్నట్లు టాక్.

ఇది ఇలా ఉండగా బాలకృష్ణ నిన్న శాతకర్ణి ఆడియో ఫంక్షన్ లో మాట్లాడిన మాటలలో ఒక్క ఇంగ్లీష్ పదం కూడ లేకుండా పూర్తిగా అచ్చ తెలుగులో మాట్లాడుతూ తాను ఈసినిమా కోసం ఎంత ప్రిపేర్ అయ్యాడో వివరించాడు. 'కాకి ఎంత కాలం బతికినా ఉపయోగం ఉండదు. కానీ హంస అలా కాదు. మన తెలుగు చలనచిత్ర రంగానికి రాజహంస ఈ గౌతమీపుత్ర శాతకర్ణి’ అంటూ ఈసినిమా పై మరన్ని అంచనాలు పెంచేసాడు బాలయ్య.

తాను 100వ సినిమా చేసే విషయంలో చాల టెన్షన్ పడ్డ విషయాన్ని వివరిస్తూ తాను ఎన్నో కథలు విన్నప్పటికీ తనకు నచ్చిన కథ ఒక్క ‘శాతకర్ణి’ మాత్రమే అంటూ తెలుగు వాళ్ళకు తెలియని చరిత్రను తెలియ చెప్పడానికే తాను ఈసినిమాను చేసాను అంటూ బాలకృష్ణ కామెంట్స్ చేసాడు. విభిన్న పాత్రలు చేయాలనే తన తండ్రి అడుగు జాడల్లో ఆయన వారసత్వాన్ని నిలుపుతూ ఈసినిమా చేసిన విషయాన్ని బయట పెట్టాడు బాలకృష్ణ.

అత్యంత కోలాహలంగా జరిగిన ఈకార్యక్రమంలో బాలకృష్ణ రాజసం ఉట్టిపడేలా పంచెకట్టుతో నిజమైన ‘శాతకర్ణి’ లా ఈ ఆడియో ఫంక్షన్ లో అభిమానులకు కనిపించాడు.  కొన్ని వేలమంది బాలకృష్ణ అభిమానులు తెలుగుదేశ కార్యకర్తలు పాల్గొన్న ఈ ఆడియో ఫంక్షన్ ఈమధ్య కాలంలో జరిగిన అతి పెద్ద ఆడియో ఫంక్షన్ గా రికార్డును క్రియేట్ చేసింది..
 
Top