మంచి సినిమాల గురించే కాదు సమాజంలో జరుగుతున్న సంఘటనల పై తన భావాలను
ట్విట్స్ గా మార్చి వెబ్ మీడియా ద్వారా తన అభిప్రాయాలను ఎప్పటికప్పుడు తన
అభిమానులతో షేర్ చేసుకునే సెలెబ్రెటీలలో ముందు వరుసలో ఉంటాడు రాజమౌళి.
భాగ్యనగరములోని ఒక ప్రముఖ నక్షత్ర హోటల్ లో వ్యభిచారం చేస్తోంది అన్న
అభియోగం పై పట్టుపడ్డ శ్వేతాబాసు ప్రస్తుతం ఒక ప్రభుత్వ మహిళా పునరావాస
కేంద్రంలో రిమాండ్ లో ఉన్న విషయం తెలిసిందే.
ఈమె వ్యవహారం పై స్పందించడమే కాకుండా ఈమెకు మానసికంగా మద్దతు తెలియ చేస్తూ
అనేకమంది బాలీవుడ్ దర్శకులు, నటులు స్పందించారు. నేరాలు చేసిన దిగువ తరగతి
మహిళలు ఉండే రెస్క్యూ హోంలో శ్వేతను ఉంచారు అన్న వార్తలు వస్తున్న
నేపధ్యంలో ఈమె పట్ల జాలిపడటమే కాకుండా శ్వేతాబసు పేరు మాత్రమే మీడియాలో
వస్తోందని, కానీ, ఈ వ్యవహారంలో ఉన్న వ్యాపారవేత్తల పేర్లు మాత్రం బయటికి
రావడం లేదని టీవీ నటి సాక్షి తన్వర్ ఆవేదన వ్యక్తం చేసింది. ఆమెకు మాత్రం
గౌరవమర్యాదలుండవా, వ్యక్తిగత స్వేచ్ఛ ఉండదా అని అంటూ కూడ ఆవేశంగా
ప్రశ్నించింది సాక్షి తన్వర్.
శ్వేతాబసు తనతోపాటు తన మొట్టమొదటి సీరియల్‌లో నటించినప్పుడు తొమ్మిదేళ్ల
అమ్మాయి అని, ఎంతో ప్రతిభావంతురాలని సాక్షి ప్రశంసిస్తోంది. అంతేకాదు ఈరోజు
మన న్యాయస్థానాలు సహజీవనాన్ని అంగీకరిస్తున్నప్పుడు శ్వేత చేసిన చిన్న
తప్పుకు ఇంత ఘోరమైన అవమానమా అంటూ నటి సాక్షి తన్వర్ అడిగిన ప్రశ్నలకు
తెలుగు సినీ దర్శకుడు రాజమౌళి తన మద్దతు ప్రకటించారు. ‘సాక్షి తన్వర్
లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం ఉందా?’ అంటూ ఆయన ట్వీట్ చేసారు.
దీనితో ఇప్పటి వరకు శ్వేతాబసు వ్యవహారంలో ఏ టాలీవుడ్ ప్రముఖుడు ప్రతి
స్పందించకపోయినా మానవతా దృక్పదంతో శ్వేత పై జాలిపడిన రాజమౌళి పట్ల మరింత
గౌరవం పెరుగుతోంది. ఈ వార్తలు ఇలా ఉండగా ప్రస్తుతం రెస్క్యూ హోమ్ లో ఉన్న
శ్వేతను కలిసి ఆమెతో ఉన్న ఇతర ప్రముఖుల పేర్లు కూడ తెలుసుకుని మీడియా ముందు
పెడతాము అని శ్వేత కుటుంబ సభ్యులు అంటున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అదే
జరిగితే ఈ వ్యవహారంలో మరిన్ని ట్విస్టులు వచ్చే అవకాశం ఉంది.