శ్రీలక్ష్మి ఎడ్యుకేషనల్ ఛారిటబుల్ ట్రస్ట్ సమర్పణలో సంతోష్ ఫిలింస్
పతాకంపై భీమగాని సుధాకర్‌గౌడ్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం
ఆదిత్య. బ్రహ్మానందం సైంటిస్టుగా నటిస్తున్నారు. టోలీచౌక్ ఒయాసిస్
స్కూల్లో చిత్రీకరణ చేస్తున్నారు. దర్శకనిర్మాత సుధాకర్ మాట్లాడుతూ-
పవన్, మహేష్‌లకు ఉన్నంత క్రేజ్ బ్రహ్మీకి ఉంది. ఏపీ, తెలంగాణ సహా
తమిళనాడు, కర్నాటక, మహారాష్ట్ర, ఒరిస్సాలోనూ ఆయన హాస్యానికి నీరాజనాలు
పలుకుతారు.
భారత క్రికెట్‌లో సచిన్ ఎలానో? కామెడీలో బ్రహ్మీ అలా! ఆగడు ఆడియోలో
దర్శకుడు శంకర్ సైతం నేను బ్రహ్మానందానికి అభిమానిని అన్నాడంటే అతడి
స్టామినా ఎంతో అర్థం చేసుకోవచ్చు. ఈ చిత్రంలో బ్రహ్మీ అద్భుతంగా
నటిస్తున్నారు. అతడితో పాటు సుమన్, ఎమ్మెస్ నారాయణ కీలకపాత్రల్లో
కనిపిస్తారు. అన్ని పనులు పూర్తి చేసి, నెలాఖరున ఆడియో రిలీజ్
చేస్తున్నాం. విద్యార్థి దశలోనే అంతర్గత సంఘర్షణను, సృజనాత్మక శక్తిని
గమనించి తీర్చిదిద్దితే గొప్ప పౌరులుగా ఎదుగుతారన్నదే కాన్సెప్ట్ అన్నారు.
జబర్ధస్త్ రాఘవ, పింకీ, జాకీ తదితరులు నటిస్తున్నారు. కెమెరా: కందేటి
శంకర్, కళ: భాస్కర్, ఎడిటింగ్: నందమూరి హరి, రచన-దర్శకత్వం: సుధాకర్
గౌడ్.