పట్టుమని పాతికేళ్ళు లేకపోయినా కమల్ చిన్న కూతురు అక్షరా హాసన్ ఈరోజు ఒక ప్రముఖ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక విషయాల పై చేసిన కామెంట్స్ మీడియా వర్గాలను కూడా ఆశ్చర్య పరుస్తున్నాయి. తాను తన అక్కలా ధైర్యవంతురాలిని కానని అందుకే తాను తన తల్లితో కలిసి ఉంటున్నానని తన అక్కకు ధైర్యం ఎక్కువ కనుక తమ వద్ద ఉండకుండా వేరుగా ఉండగలుగుతోందని షాకింగ్ కామెంట్స్ అనేకం చేసింది అక్షర.
తన అక్క శ్రుతి తాను ఇంత అందంగా పుట్టినాము అంటే అది తమ చేతులలో లేదని అది తమ తల్లి తండ్రుల చేతులలో కూడా లేదని తమను ఇంత అందంగా పుట్టించిన ఆ దేముడికి జీవితాంతం ఋణపడి ఉంటాను అని అంటోంది అక్షర. అయితే తాను దైవ శక్తిని నమ్ముతాను కాని తన అక్కలా ప్రతిరోజు విగ్రహ పూజలు చేయనని తన అక్క పై కామెంట్లు చేసింది అక్షర.
తన తల్లితండ్రులు కమల్ సారికలు ఎందుకు విడిపోయారో తనకు తెలియదని ఇంత వయస్సు వచ్చాక కూడా తాను ఆ విషయం గురించి ఎప్పుడూ తన తల్లిని అడగలేదు అని చెపుతోంది అక్షర. ఇక తన మొదటి సినిమా ‘షమితాబ్’ సినిమాలో అమితాబ్ పక్కన నటించడం గురించి ప్రస్తావిస్తూ ఈ సినిమా షూటింగ్ మొదటి రోజున అమితాబ్ కు నమస్కరించాలా? లేదంటే పాదనమస్కారం చేయాలా? అని టెన్షన్ పడుతూ షూటింగ్ స్పాట్ కు వెళ్లానని చెప్పింది అక్షర.
అయితే అమితాబ్ తనను ఒక సొంత మనవరాలుగా దగ్గరకు తీసుకుని తాను నటిస్తుంటే తనను మెచ్చుకుని ప్రోత్సహించిన సందర్భం గుర్తుకు వచ్చినప్పుడల్లా తనకు ఉద్వేగంతో ఏడుపు వస్తుందని అంటూ తన అక్క శ్రుతి హాసన్ లో ఉండే తెలివి తనకు ఇంకా రాలేదని కామెంట్స్ చేసుకుంది అక్షర..
 
Top